Dec 26, 2022
ప్రతి 1000 జననాలలో మూడు> సెరిబ్రల్ పాల్సీ (మస్తిష్క పక్షవాతము)తో బాధపడుతూ ఉంటారు
• భారతదేశంలో 25 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు
• గర్భధారణ దశ నుంచి శ్రద్ధ అవసరమని నిపుణులు చెబుతున్నారు
భారతదేశంలో ప్రతి 1000 జననాలకు, ముగ్గురు శిశువులు సెరిబ్రల్ పాల్సీ (సిపి) బారిన పడుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా 1.7 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతుండగా, దేశంలో దాదాపు 25 లక్షల మంది ఉన్నారు. వీరిలో 72 శాతం మంది గ్రామీణ భారతదేశంలో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడిన ప్రతి నలుగురిలో ఒకరు మాట్లాడలేరు. ముగ్గురిలో ఒకరు నడవలేరు. ప్రతి ఇద్దరిలో ఒకరికి వయస్సుకు-తగిన తెలివితేటలు లోపిస్తాయి(మేధో వైకల్యం). మూర్ఛలు నలుగురిలో ఒకరిని ప్రభావితం చేస్తాయి. మస్తిష్క పక్షవాతం అనేది మారుతూ ఉండే తీవ్రతతో కూడుకున్నదని మరియు చాలామంది వయస్సుతో మెరుగుపడి స్వతంత్రత సాధిస్తారని నిపుణులు అంటున్నారు.
కారణాలు.....
తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు అధిక రక్తపోటు, మధుమేహం నియంత్రణలో లేకుంటే...
పోషకాహార లోపం వల్ల శిశువు ఎదుగుదల కుంటుపడినట్లయితే
బిడ్డ పుట్టేటప్పుడు తల్లి నుండి సంక్రమణం
ప్రసవానికి ముందు లేదా సమయంలో శిశువు మెదడుకు ఆక్సిజన్ తగ్గినట్లయితే
పుట్టిన తర్వాత శిశువు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 45మిగ్రా/డిఎల్ కంటే తక్కువకు పడిపోతే
మెనింజైటిస్ వంటి సంక్రమణాలు పుట్టిన 2 సంవత్సరాలలోపు మెదడుకు సోకితే... అది శిశువు మెదడు అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
2 సంవత్సరాల వయస్సు కంటే ముందు తలకు బలమైన గాయం మరియు మెదడులో రక్తస్రావం జరిగినా కూడా, ఇవి దీర్ఘకాలిక మెదడు గాయానికి కారణమవుతాయి.
ఫలితంగా...
మెదడుకు కలిగే నష్టం మరియు అది ప్రభావితం చేసే నరాలను బట్టి ఆయా అవయవాల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రక్తంలో తక్కువ గ్లూకోజ్ స్థాయిలు దృష్టి లోపానికి కారణమవుతాయి. వారికి మూర్ఛలు ఉంటాయి. నడక మందగిస్తుంది. ప్రసవ ప్రక్రియ సమయంలో మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గినట్లయితే, మాట, కదలిక మరియు మింగడం ప్రభావితం కావచ్చు, మూర్ఛలు వచ్చే ప్రమాదం ఉంటుంది. నాలుగు అవయవాలు స్పాస్టిసిటీ (సాధారణ కదలికను నిరోధిస్తూ కండరాలు గట్టిపడటం) లేదా కదలిక అసాధారణతతో ప్రభావితమైనట్లయితే, వారికి న్యుమోనియా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అయితే, బాధిత వ్యక్తులు చాలా మందిలో, ఒకటి లేదా రెండు అవయవాలు మాత్రమే ప్రభావితమవుతాయి. ఆ మేరకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వారు నిండు జీవితాంతం జీవిస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల సెరిబ్రల్ పాల్సీ అని నిర్ధారణ చేయబడిన వెంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.
లక్షణాల ప్రకారం చికిత్స
ఆరు నెలలు దాటిన తర్వాత కూడా శిశువు మెడను నిలపలేకపోతూ ఉంటే.... 3 నెలల తర్వాత కూడా శిశువు చూడలేకపోతూ ఉంటే... లేదా 4-6 నెలల వయస్సు నుంచి అకస్మాత్తుగా మూర్ఛలు వస్తూ ఉంటే... అతని/ఆమె ఎదుగుదల ఆలస్యమైతే... తల్లిదండ్రులు శిశువైద్యుడు/శిశు నరాల వైద్య నిపుణుడిని సంప్రదించాలి. చికిత్స అనేది లక్షణాల పై ఆధారపడి ఉంటుంది.
మోటార్ డెవలప్‌మెంట్‌లో జాప్యం ఉన్నట్లయితే ఫిజియోథెరపీ నిర్వహించవలసి ఉంటుంది. మూర్ఛలు ఉంటే, దానికి సంబంధించిన మందులు మరియు పోషకాహారాన్ని అందించాలి. దృష్టి లోపం ఉన్న సందర్భంలో దృష్టి పునరావాసం.
నివారణ చర్యల్లో గర్భధారణ సమయంలో పోషణ కలిగిన ఆహారం ఉండాలి. ప్రణాళికాబద్ధమైన గర్భధారణకు 3 నెలల ముందు యాంటెనాటల్ టీకాలు (ఎంఎంఆర్ మరియు వరిసెల్లా టీకా). అధిక రక్తపోటు మరియు మధుమేహం ఉన్నట్లయితే, వాటిని నియంత్రించాలి. హైపోక్సియా ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రసవ సమయంలో పిండం హృదయ స్పందన రేటు మరియు ఇతర పారామితులను పర్యవేక్షించడం. అకాల ప్రసవం విషయంలో, ప్రసవం కోసం మంచి నియోనాటల్ సౌకర్యాలు ఉన్న ప్రదేశానికి ముందస్తు బదిలీని ప్లాన్ చేసుకోవాలి. జీవితంలోని 2-4 రోజులలో హైపోగ్లైసీమియా (అల్ప రక్త చక్కెర) ప్రమాదం గరిష్టంగా ఉంటుంది మరియు ప్రమాదంలో ఉన్న నవజాత శిశువులను నిశితంగా పరిశీలించి మరియు హైపోగ్లైసీమియాను నివారించాలి. ప్రమాదవశాత్తు తలకు గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
డా. లోకేష్ లింగప్ప,
కన్సల్టంట్ చైల్డ్ అండ్ అడొల్సెంట్ న్యూరాలజిస్ట్,
రెయిన్‍బో చిల్డ్రన్స్ హాస్పిటల్
Consultant Child and Adolescent Neurologist
Rainbow Children's Hospital - Banjara Hills